Friday, October 20, 2017
Goli Nageswara rao friend in high school
బాల్య స్నేహమాధుర్యం
గోలి నాగేశ్వరరావు
నేను సూర్యదేవర నర్సయ్య హైస్కూల్ (చేబ్రోలు) లో ఆరవ తరగతి నుండి చదివినప్పుడు నాకు ప్రియ మిత్రుడుగా గోలి నాగేశ్వరరావు వుండేవాడు. మా వూరుకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ముట్లూరు గ్రామం నుండి రోజూ సైకిలు మీద కొందరు విద్యార్థులు వచ్చేవారు. వారిలో గోలి నాగేశ్వరరావు ఒకరు. అతను మా ఇంటి దగ్గర ఆగి నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టుకుని స్కూలుకి తీసుకెళ్ళేవారు. ఇది ఆరవ తరగతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తయ్యేవరకు కొనసాగింది. ముట్లూరు గ్రామం మా వూరు పాతరెడ్డి పాలెం - చేబ్రోలుకు సమీపంలో ఉండేది. దగ్గరలో మరే హైస్కూలు లేనందువల్ల అక్కడి విద్యార్థులంతా చదువు నిమిత్తం వచ్చేవారు. ఆ విధంగా ప్రారంభమయిన మా స్నేహం నాగేశ్వరరావు చనిపోయేవరకు కొనసాగింది. ముట్లూరు గ్రామం నుండి అనేకమంది విద్యార్థులు సైకిళ్ళమీద రోజూ వచ్చినా నాగేశ్వరరావు మాత్రం తప్పనిసరిగా ఆ ఇంటి ముందు ఆగి బెల్ కొట్టి నన్ను సైకిలు మీద కూర్చోబెట్టుకుని వెళ్ళేవారు. క్లాసులో ఒకేచోట కూర్చునే వాళ్ళం. కలిసి చదివేవాళ్ళం. హోం వర్క్ నోట్సులు ఎక్స్ ఛేంజ్ చేసుకునేవాళ్ళం. టీచర్లపై మా అభిప్రాయాలు కూడా ఒకే రకంగా వుండేవి. నాగేశ్వరరావు చాలా చక్కగా వుండేవాడు. శుభ్రమైన దుస్తులు ధరించి క్రమశిక్షణతో వుండేవాడు. నేను రానురాను వారి కుటుంబంలో ఒకడిగా అయిపోయాను. తరచు ముట్లూరు గ్రామం వెళ్ళి వారి ఇంట్లో కాలక్షేపం చేసి వచ్చేవాడిని. నాగేశ్వరరావు తండ్రి మగ్గం నేసేవాడు. వారి కుటుంబం అంతా ఆ మగ్గం పనుల్లోనే నిమగ్నమయ్యేవారు. స్కూలులో బ్యాట్మింటన్, వాలీబాల్ ఆటలలో కలిసి పాల్గొనే వాళ్ళం. చేబ్రోలుకు ఎనిమిది మైళ్ళ దూరాన వున్న గుంటూరు నగరం వెళ్ళి ఒకసారి హోటలులో దోసె తిని రావటం ఆ రోజులలో అదే మాకు వింతగా వుండేది. స్కూలులో ఉపాధ్యాయులపై మా అభిప్రాయాలు కూడా బాగా కలిసేవి.
హైస్కూలు చదువు ముగిసిన తర్వాత నేను గుంటూరులో కాలేజీలో చేరటం, నాగేశ్వరరావు విజయవాడ పర్యటనతో మేము కొంచెం దూరమయ్యాం. స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. నాగేశ్వరరావు విజయవాడలో శోభనాచల స్టూడియో కంపెనీ ఉద్యోగంలో సినిమా ప్రతినిధిగా చేరాడు. అయితే విడుదలయిన వారి సినిమాలకు కలెక్షన్ ఎలా వస్తున్నదో చూడటం సరిగా జమకడుతున్నారో లేదో గమనించటం, యాజమాన్యానికి ఎప్పటికప్పుడు తెలియచేయడం అతని విధి. నేను విజయవాడ వెళ్ళినప్పుడు గాంధీనగర్ లోని ఆఫీసుకు వెళ్ళి నాగేశ్వరరావుతో కాలక్షేపం చేసేవాడిని. వారి సినిమాలకు తీసుకెళ్ళేవారు. అలా జరుగుతుండగా నేను ఎమ్.ఎ. చదువు నిమిత్తం విశాఖపట్టణం పోవటంతో నాగేశ్వరరావు తాత్కాలికంగా దూరమయ్యాడు. మళ్ళీ నేను సంగారెడ్డిలో నాలుగు సంవత్సరాలపాటు టీచరుగా పనిచేసినప్పుడు నాగేశ్వరరావు కూడా అక్కడికి వచ్చి నేను పనిచేసే స్కూలులోనే సెకండరీ గ్రేడ్ టీచర్ గా వృత్తి కొనసాగించాడు. మళ్ళీ పాత రోజులవలె సన్నిహితులమయ్యాము. అప్పట్లో మా అక్క మెదక్ జిల్లా స్త్రీ సంక్షేమ శాఖాధికారిగా సంగారెడ్డిలో వుండేది. మేము ఇరువురం అక్కడ మళ్ళీ కలిసి వుండే అవకాశం వచ్చింది. అదే సాన్నిత్యంతో ఉన్నాము. ఇద్దరం కలిసి స్థానిక జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి విపరీతంగా గ్రంథ పఠనం చేసేవాళ్ళం. వీరేశలింగం, మునిమాణిక్యం మొదలైన వారి రచనలు కలిసి చదివేవాళ్ళం. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా జనార్దన రెడ్డి మాకు బాగా సహకరించేవాడు. రోజూ సాయంకాలం కొద్దిమంది టీచర్లు కలిసి వూరి వెలుపలికి వెళ్ళి పొలాల్లో తిరిగి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం ఆనవాయితీగా వుండేది.
1964లో నా వివాహం తెనాలిలో అయినప్పుడు నాగేశ్వరరావు చీరాలకు చేరుకున్నారు. అతడు సుబ్బరావమ్మ అనే చక్కని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. నేను ఆ వివాహానికి హాజరై చాలా సంతోషించాను. నా పెళ్ళికి వద్దన్నా వినకుండా నాగేశ్వరరావు దంపతులు తాళి చేయించి ఇచ్చారు. అది నేను వాడలేదనుకోండి. అది వేరే విషయం. పెళ్ళికి నాగేశ్వరరావు వచ్చి చాలా సంతోషించాడు. క్రమంగా చీరాలలో ఉబ్బస వ్యాధితో బాధపడ్డాడు. అది రానురాను అతన్ని బాగా క్షీణింపచేసింది. ఆ సమయంలో నేను చీరాల వెళ్ళి చూసివస్తుండేవాడిని. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ నాగేశ్వరరావు త్వరలోనే ఉబ్బస వ్యాధితో చనిపోయాడు. కుమారుడు మాత్రం చదువుకుని ఆస్ట్రేలియా వెళ్ళి కుదురుకున్నాడు. ఏమైనా నాగేశ్వరరావుతో నా స్నేహం చాలా మధురమైనదిగా మిగిలిపోయింది. అతనితో ఒక ఫొటో వుండటం నాకెంతో ఆనందదాయకమైన విషయం.
నరిసెట్టి ఇన్నయ్య
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment