Friday, October 20, 2017
Goli Nageswara rao friend in high school
బాల్య స్నేహమాధుర్యం
గోలి నాగేశ్వరరావు
నేను సూర్యదేవర నర్సయ్య హైస్కూల్ (చేబ్రోలు) లో ఆరవ తరగతి నుండి చదివినప్పుడు నాకు ప్రియ మిత్రుడుగా గోలి నాగేశ్వరరావు వుండేవాడు. మా వూరుకు నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న ముట్లూరు గ్రామం నుండి రోజూ సైకిలు మీద కొందరు విద్యార్థులు వచ్చేవారు. వారిలో గోలి నాగేశ్వరరావు ఒకరు. అతను మా ఇంటి దగ్గర ఆగి నన్ను సైకిలు మీద ముందు కూర్చోపెట్టుకుని స్కూలుకి తీసుకెళ్ళేవారు. ఇది ఆరవ తరగతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తయ్యేవరకు కొనసాగింది. ముట్లూరు గ్రామం మా వూరు పాతరెడ్డి పాలెం - చేబ్రోలుకు సమీపంలో ఉండేది. దగ్గరలో మరే హైస్కూలు లేనందువల్ల అక్కడి విద్యార్థులంతా చదువు నిమిత్తం వచ్చేవారు. ఆ విధంగా ప్రారంభమయిన మా స్నేహం నాగేశ్వరరావు చనిపోయేవరకు కొనసాగింది. ముట్లూరు గ్రామం నుండి అనేకమంది విద్యార్థులు సైకిళ్ళమీద రోజూ వచ్చినా నాగేశ్వరరావు మాత్రం తప్పనిసరిగా ఆ ఇంటి ముందు ఆగి బెల్ కొట్టి నన్ను సైకిలు మీద కూర్చోబెట్టుకుని వెళ్ళేవారు. క్లాసులో ఒకేచోట కూర్చునే వాళ్ళం. కలిసి చదివేవాళ్ళం. హోం వర్క్ నోట్సులు ఎక్స్ ఛేంజ్ చేసుకునేవాళ్ళం. టీచర్లపై మా అభిప్రాయాలు కూడా ఒకే రకంగా వుండేవి. నాగేశ్వరరావు చాలా చక్కగా వుండేవాడు. శుభ్రమైన దుస్తులు ధరించి క్రమశిక్షణతో వుండేవాడు. నేను రానురాను వారి కుటుంబంలో ఒకడిగా అయిపోయాను. తరచు ముట్లూరు గ్రామం వెళ్ళి వారి ఇంట్లో కాలక్షేపం చేసి వచ్చేవాడిని. నాగేశ్వరరావు తండ్రి మగ్గం నేసేవాడు. వారి కుటుంబం అంతా ఆ మగ్గం పనుల్లోనే నిమగ్నమయ్యేవారు. స్కూలులో బ్యాట్మింటన్, వాలీబాల్ ఆటలలో కలిసి పాల్గొనే వాళ్ళం. చేబ్రోలుకు ఎనిమిది మైళ్ళ దూరాన వున్న గుంటూరు నగరం వెళ్ళి ఒకసారి హోటలులో దోసె తిని రావటం ఆ రోజులలో అదే మాకు వింతగా వుండేది. స్కూలులో ఉపాధ్యాయులపై మా అభిప్రాయాలు కూడా బాగా కలిసేవి.
హైస్కూలు చదువు ముగిసిన తర్వాత నేను గుంటూరులో కాలేజీలో చేరటం, నాగేశ్వరరావు విజయవాడ పర్యటనతో మేము కొంచెం దూరమయ్యాం. స్నేహం మాత్రం అలాగే కొనసాగింది. నాగేశ్వరరావు విజయవాడలో శోభనాచల స్టూడియో కంపెనీ ఉద్యోగంలో సినిమా ప్రతినిధిగా చేరాడు. అయితే విడుదలయిన వారి సినిమాలకు కలెక్షన్ ఎలా వస్తున్నదో చూడటం సరిగా జమకడుతున్నారో లేదో గమనించటం, యాజమాన్యానికి ఎప్పటికప్పుడు తెలియచేయడం అతని విధి. నేను విజయవాడ వెళ్ళినప్పుడు గాంధీనగర్ లోని ఆఫీసుకు వెళ్ళి నాగేశ్వరరావుతో కాలక్షేపం చేసేవాడిని. వారి సినిమాలకు తీసుకెళ్ళేవారు. అలా జరుగుతుండగా నేను ఎమ్.ఎ. చదువు నిమిత్తం విశాఖపట్టణం పోవటంతో నాగేశ్వరరావు తాత్కాలికంగా దూరమయ్యాడు. మళ్ళీ నేను సంగారెడ్డిలో నాలుగు సంవత్సరాలపాటు టీచరుగా పనిచేసినప్పుడు నాగేశ్వరరావు కూడా అక్కడికి వచ్చి నేను పనిచేసే స్కూలులోనే సెకండరీ గ్రేడ్ టీచర్ గా వృత్తి కొనసాగించాడు. మళ్ళీ పాత రోజులవలె సన్నిహితులమయ్యాము. అప్పట్లో మా అక్క మెదక్ జిల్లా స్త్రీ సంక్షేమ శాఖాధికారిగా సంగారెడ్డిలో వుండేది. మేము ఇరువురం అక్కడ మళ్ళీ కలిసి వుండే అవకాశం వచ్చింది. అదే సాన్నిత్యంతో ఉన్నాము. ఇద్దరం కలిసి స్థానిక జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి విపరీతంగా గ్రంథ పఠనం చేసేవాళ్ళం. వీరేశలింగం, మునిమాణిక్యం మొదలైన వారి రచనలు కలిసి చదివేవాళ్ళం. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా జనార్దన రెడ్డి మాకు బాగా సహకరించేవాడు. రోజూ సాయంకాలం కొద్దిమంది టీచర్లు కలిసి వూరి వెలుపలికి వెళ్ళి పొలాల్లో తిరిగి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయటం ఆనవాయితీగా వుండేది.
1964లో నా వివాహం తెనాలిలో అయినప్పుడు నాగేశ్వరరావు చీరాలకు చేరుకున్నారు. అతడు సుబ్బరావమ్మ అనే చక్కని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నారు. నేను ఆ వివాహానికి హాజరై చాలా సంతోషించాను. నా పెళ్ళికి వద్దన్నా వినకుండా నాగేశ్వరరావు దంపతులు తాళి చేయించి ఇచ్చారు. అది నేను వాడలేదనుకోండి. అది వేరే విషయం. పెళ్ళికి నాగేశ్వరరావు వచ్చి చాలా సంతోషించాడు. క్రమంగా చీరాలలో ఉబ్బస వ్యాధితో బాధపడ్డాడు. అది రానురాను అతన్ని బాగా క్షీణింపచేసింది. ఆ సమయంలో నేను చీరాల వెళ్ళి చూసివస్తుండేవాడిని. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ నాగేశ్వరరావు త్వరలోనే ఉబ్బస వ్యాధితో చనిపోయాడు. కుమారుడు మాత్రం చదువుకుని ఆస్ట్రేలియా వెళ్ళి కుదురుకున్నాడు. ఏమైనా నాగేశ్వరరావుతో నా స్నేహం చాలా మధురమైనదిగా మిగిలిపోయింది. అతనితో ఒక ఫొటో వుండటం నాకెంతో ఆనందదాయకమైన విషయం.
నరిసెట్టి ఇన్నయ్య
Thursday, October 12, 2017
పరిచయం
కీ.శే. పువ్వాడ నాగేశ్వరరావుగారు మానవవాదిగా గుంటూరులో ప్రజావాణి పత్రికకు రాసిన వ్యాసాలు గ్రంథస్థం చేశారు. ఆ రచనకు ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక రాశారు. అది తొలిసారి పత్రికలోప్రచురణ
ఈ వ్యాస సంపుటి రచయిత, రమారమి గత పాతికయేండ్లుగా ఒక ప్రత్యేక, విశిష్ట సాంఘిక దృక్పధంతో విషయ పరిశీలన చేస్తూ యిటీవల చరిత్రపట్ల మనసునిల్పి, కొన్ని రంగాలు కూలంకషంగా తరచి చూచి, సాంఘిక ఉద్యమాల రూపురేఖలను పరామర్శించి, ఒక బృహద్గ్రంథాన్ని తయారు చేయుటకై విషయ సేకరణ చేశారు.
ఆ కృషి జరిగే సమయాల్లో ఆంధ్రలో కరణీకములను గూర్చి దేశంలో సంస్కృతమును గురించి దృష్టి సారించి ఆ యా విషయాలను తడవి చూపారు.
నాగేశ్వరరావుగారి స్వభావ, తత్త్వములను యెరిగిన వారికి యీ పుస్తకం చదువుతుంటే వారితో మాట్లాడినట్లే ఉంటుంది. 'భాషను బట్టి మనిషిని పోల్చ' వచ్చు నన్న నానుడికి వీరి రచన బలీయమైన తార్కాణం.
ఆంధ్ర సాంఘిక జీవితంలో 'కరణీకాలకు' మొన్న మొన్నటిదాకా కొన్ని ప్రాంతాల్లో యిప్పుడు గూడా చాలా ప్రముఖ స్థానం వుంది. గ్రామీణ జీవితాల్లో కరణాలు ఒక కీలక స్థానాన్ని ఆక్రమించారు. చారిత్రక సన్నివేశాలెట్లా ఉన్నా సాంఘిక జీవితాన్ని కొన్ని యెడల రాజకీయ జీవితాన్ని, నియతం చేయగల శక్తి, యీ కీలక స్థానాలకు దక్కింది. అది దృష్టిలో నుంచుకొనే నాగేశ్వరరావుగారు చారిత్రక విషయ సముపార్జన చేశారు. వ్యావహారిక రంగంలోని మర్మలేగాక, భాషా విషయక రంగంలో కూడా కరణీక కుటుంబాలవారి ప్రశస్తి గమనించిననే గాని తెలుగుదనం పాదుకొన్నచోట్లు పరిగణనకు రావు.
వైదికమత జైత్రయాత్రా సాఫల్యతను చేకూర్చిన వారిలో ఈ వర్గానికున్న స్థానం మత గురువులకుగాని, పూజారులకు గాని, పురోహితులకుగాని లేదు. జీతం బత్తెంలేని తీవ్రకృషి వైదికానికి వీరు ప్రోది చేశారు.
నేటి గ్రామీణ వ్యవస్థలో కరణాల పాత్ర పంచాయతీల ఆగమన, ఉద్ధృతంలో తగ్గినట్లు ఉన్నా కీలక పరిస్థితి కీలకంగానే ఉంది. ప్రభుత్వానికీ, వైదికానికీ, కరణాలు కీలకాలు, పునాదులు. ఒకరిచ్చిన వరుమానంతో తమకు నచ్చిన రెండవ కృషి గూడా చేస్తారు.
ఇది మనసులో ఉంచుకొని వ్యాసం చూడండి. ఇతర ఆనుపానులు మీకే దృగ్గోచర మౌతై.
ఈ పుస్తకానికి జీవం, మూడోవ్యాసం, సంస్కృత కధా కథనం. స్వరాజ్య పాలనారంభం కాగానే చిన్న పెద్దలందరూ ఆగుబ్బుగా రేగి, సంస్కృతాన్ని పునరుద్ధరించాలని సమావేశాల మీద సమావేశాలు చేసి, విశ్వ సంస్కృత పరిషత్తులను గూడాస్థాపించి, ప్రణాళికా బద్ధ కృషి సాగించారు.
సంస్కృతం తెలియనివాడు భారతీయాత్మ నెరుగనివారన్నారు. 'సంస్కృత' మంటే 'సంస్కృతి' అని కూడా నవ్య నిర్వచనం చేశారు. సంస్కృతి, కేవలం ఒక భాషకాదన్న నగ్న సత్యాన్ని గూడా తిరస్కరించి, తికమకపెట్టనారంభించారు. క్రమస్థితిని ఆ నైజం బయటపడుతుంది. దాని బండారాన్ని మన రచయిత, చరిత్ర సమ్మతంగా, నిరాడంబరంగా, నిజంగా బయటకు లాగారు. దానికి తిరుగు లేదు, రచయిత వాదం అప్రతిహతం.
సంస్కృతం నిజానికి ఒక మూలభాష కాదు. ఈ విషయం కొందరకు కష్టంగా వున్నా, చరిత్ర చెప్పే సత్యాన్ని గ్రహిస్తే, సత్యాన్ని సత్యంగా గ్రహించవచ్చు. రచయిత, యింకా వివరంగా, సోదాహరణాలన్నింటిని చూపితే, గ్రంథం విస్తరించినా, సత్యాన్ని కచ్చడాలు యెక్కువగా దొరికేవి, మంచి కవచాలు అందేవి. ఆ పని, విషయం కల్గిన మన రచయిత భవిష్యత్తులోనైనా చేసి తీరాలి, దానికై ఒక ప్రత్యేక పుస్తకం కావాలి.
సంస్కృతం మూలభాష కాదు. ప్రాకృతం మూల భాష, ప్రాకృతాన్ని సంస్కరించి, దానికి సంస్కృతమని పేరు పెట్టి, పుత్రికకు మాతృస్థానాన్ని చేకూర్చి, పౌరాణిక నైతికత్వాన్ని రుజువుచేశారు.
ఈ మూల సిద్ధాంతాన్ని చర్చా వేదికలోకి తెచ్చిన నాగేశ్వరరావుగారి కృషి నిజంగా సాహసోపేతం, ప్రశంసార్హం. కాని, సంస్కృతాన్నే సంస్కృతికి పర్యాయపదంగా వాడే ప్రాకృతలోకం నాగేశ్వరరావుగారిని ఆడిపోస్తుంది, పోయనిండు, పోయెడిదేమి?
రెండవ వ్యాసాన్ని యీ వ్యాసపత్రయంలో వేయకుండా వుంటే బాగుండేది. దానిలోని విషయానికి, తతిమ్మా రెంటిలోని విషయానికి సామీప్యం లేదు.
వైదికానికి భావం కూర్చింది సంస్కృతం, దానికి పాదులు చేర్చింది కరణీకాలు.
రచయిత హేతువాది, హేతువాదానికి, చారిత్రక దృష్టి, శాస్త్రీయగీతి, నైతిక గమనం అవసరం. ఆ మూటిని రచయిత తనలో ఆకళింత చేసుకుని, తన భావ పరంపరను సూటిగా తను మాట్లాడే రీతిలో, హృదయానికి హత్తుకొనేటట్లు చెప్పారు.
పాఠకలోకం, యీ గ్రంథాన్ని యీ దృష్టితో చూచి, యీ విధానానికి వూతాన్ని చేకూర్చి, యింకా ముందుకు విశాలవంతంగా పోయే, పోగలిగిన అలవాటు చేసుకోగలుగుతుందని ఆశిస్తాను, దానికి పుంతలు వేసిన నాగేశ్వరరావుగారిని అభినందిస్తాను.
తెనాలి ఆవుల గోపాలకృష్ణమూర్తి
28-2-1958 ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి.
కీ.శే. పువ్వాడ నాగేశ్వరరావుగారు మానవవాదిగా గుంటూరులో ప్రజావాణి పత్రికకు రాసిన వ్యాసాలు గ్రంథస్థం చేశారు. ఆ రచనకు ఆవుల గోపాలకృష్ణమూర్తి పీఠిక రాశారు. అది తొలిసారి పత్రికలోప్రచురణ
Subscribe to:
Posts (Atom)